Type Here to Get Search Results !

Our Photo Gallery

చాకలి ఐలమ్మ వర్దంతి 10 సెప్టెంబర్

"చాకలి ఐలమ్మ "గారి వర్ధంతి సంధర్భంగా  సమాచారం

*చిట్యాల ఐలమ్మ*( 1919 - సెప్టెంబర్ 10 , 1985 ) చాకలి ఐలమ్మ గా గుర్తింపు పొందిన తెలంగాణా వీరవనిత. సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్య శాలి.

*జననం - వివాహం- పిల్లలు*

🅾1919 లో వరంగల్ జిల్లా , రాయపర్తి మండలం
క్రిష్టాపురం గ్రామం లో ఓరుగంటి మల్లమ్మ, సాయిలు కు నాలోగో సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది. పాలకుర్తి కి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమారులు ,ఇద్దరు కుమార్తెలు . ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం, చాకలి కులవృత్తే వారికి జీవనాధారం.

1940-44 మధ్య కాలంలో విస్నూర్ లో దేశ్ముఖ్, రజాకర్ల అరాచకాల పై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది ఐలమ్మ.

అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’అని ఉత్పత్తికులాల (బీసీ కులాల) చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు. దొరా అని పిలువకపోతే ఉన్నతకులాలతో పాటు వారి అనుంగు ఉంపుడుకత్తెలలో కూడా ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాలలో బయటకు వచ్చేది. వెనుకబడిన కులాల మీద ఆ పీడన రూపాలు విరుచుకుపడేవి. తమను దొరా అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి, దగ్గరుండి ఆఘాయిత్యం చేయించేవారు. ఈ భూమినాది. పండించిన పంటనాది. తీసుకెళ్లడానికి దొరెవ్వడు. నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ.

మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది. అందులో నాలుగు ఎకరాలు సాగుచేశారు. పాలకుర్తి పట్వారీ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది. జీడి సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలు.

పాలకుర్తి పట్వారీ శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పనిచేయడానికి నిరాకరించింది. పాలకుర్తి పట్వారీ పప్పులుడకక అయిలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విసునూర్ దేశ్ముఖ్ రాపాక రాంచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. కేసులో అగ్రనాయకులతో పాటు అయిలమ్మ కుటుంబాన్ని ఇరికించారు. అయినప్పటికీ కోర్టులో తీర్పు దేశ్ముఖ్కు వ్యతిరేకంగా వచ్చింది.

అయిలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన దేశ్ముఖ్ పట్వారిని పిలిపించుకొని, అయిలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించుకున్నాడు. భూమి తనదని, వండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకురమ్మని వందమందిని దేశ్ముఖ్ పంపాడు. ఆంధ్రమహాసభ కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నరసింహారెడ్డి , ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోసారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పువచ్చింది. రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్ముఖ్ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు. ఐలమ్మ ఇంటిని కూడా తగులబెట్టారు. ధనాన్ని, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ కూతురు సోమనర్సమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఐలమ్మ కుమారులు ముగ్గురు పాలకుర్తి పట్వారీ ఇంటిని కూల్చి అదే స్ధలంలో మొక్కజొన్న పంటను పండించారు. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ అయిలమ్మ కుటుంబం ఎరజ్రెండాను వీడలేదు.

‘ఈ దొరగాడు ఇంతకంటే ఇంక నన్ను ఏవిధంగా నష్టపెట్టగలడు’ అని తనలో తాను ప్రశ్నించుకొన్నది.నీ దొరోడు ఏం చేస్తాడ్రా’ అని మొక్కవోని ధెైర్యంతో రోకలి బండ చేతబూని గూండాలను తరమి కొట్టింది. కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది. అయిలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. అయిలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది.

*మరణం*

ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన అయిలమ్మ
సెప్టెంబర్ 10 , 1985 న అనారోగ్యంతో మరణించింది.

పాలకుర్తిలో అయిలమ్మ స్మారక స్థూపం, స్మారక భవనంను సిపిఎం పార్టీ వారు నిర్మించారు.
🔵❇🅾🎾✴✴✳✡🔴

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

MPPS Singitham

MPPS SINGITHAM