జాతీయ ఓటర్ల దినోత్సం,National Voters Day
రాజకీయ ప్రక్రియలో మరింత మంది యువకులు భాగస్వాములయ్యేందుకు వీలుగా ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం 2011 సం.లో నిర్ణయించింది. కేంద్ర న్యాయశాఖ చేసిన ఈ ప్రతిపాదనకు ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని మంత్రివర్గం తన ఆమోదముద్ర వేసింది.మరోవైపు దేశవ్యాప్తంగా 8.5 లక్షల పోలింగ్ కేంద్రాల పరిధిలో 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులను గుర్తించే కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా అమలు జరపాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ప్రతి ఏటా పేర్లు నమోదు చేసుకున్న ఓటర్లకు జనవరి 25 నాటికి ఫోటో గుర్తింపు కార్డులిచ్చేందుకు ప్రణాళికను రూపొందించారు. దేశంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా హాజరై ఎంపిక చేసిన ఐదుగురు కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేస్తారు.
కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తొలిసారి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మంగళవారం (25 జనవరి 2011)నాడు నిర్వహిస్తోంది. 1950 జనవరి 25వ తేదీన భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని స్ఫురణకు తెచ్చేలా.. ఓటు హక్కు విలువను చాటి చెప్పేలా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ప్రజాస్వామ్య పటిష్టత ఎన్నికలపైననే ఆధారపడి ఉంది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేతిలో దేశ భవిష్యత్తును ఓటర్లు పెడుతున్నారు. ఆ ప్రజాప్రతినిధులే కర్కోటకులైతే, వారే లంచగొండులు, భూబకాసురులైతే ఇక ప్రజాస్వామ్యం అధోగతే. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల కమిషన్ కీలక పాత్ర వహిస్తోంది. ఏ రాజకీయ పక్షానికి తలవంచక, స్వతంత్రంగా తన విధులను నిర్వహిస్తోంది. కేంద్ర స్థాయిలో భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రజాస్వామ్య మనుగడ, పటిష్టం ఓటరుపై ఆధారపడి ఉన్నందున ఆ రెండు సంఘాల ఓటర్లను చైతన్యం చేస్తున్నాయి.
జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25న నిర్వహించేందుకు ప్రతి సంవత్సరం కార్యక్రమాల నిర్వహణకై పిలుపునిస్తూ స్థానిక అధికారులచే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఓటరుగా బాధ్యత నిర్వహించుటకే ఓటరు గుర్తింపు కార్డు పొందాలని, ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పటిష్టపర్చాలని పిలుపునిస్తోంది. అదే రోజు ఓటర్ల దినోత్సవ వేడుకల్లో కొత్తగా నమోదైన ఓటర్లను సన్మానిస్తారు. ఓటర్ల దినోత్సవం రోజు బూత్ స్థాయి అధికారి, పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రతిజ్ఞ చేసేందుకు పిలుపునిస్తారు. ఓటు నమోదుకు సంభందించి రెండు పాస్ పోర్టు సైజు ఫోటోలు, జనన దృవీకరణ పత్రం, తల్లితండ్రుల ఆఫిడివిట్ ఆధారంగా ఓటును నమోదు చేసుకొవాలని సూచించారు.
ప్రజాస్వామ్య పటిష్టతకు ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న వారి సంఖ్య 5.70 కోట్లకు చేరిందని బన్వర్‌లాల్ పేర్కొన్నారు. ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఓటరు లిస్టులో ఇప్పటికీ నమోదు చేసుకోని వారు మంగళవారం స్థానిక పోలింగ్ కేంద్రాల వద్దకెళ్లి నమోదు చేసుకోవాలని కోరారు. నెల రోజుల్లో వారికీ కొత్త కార్డులు జారీ చేస్తామని చెప్పారు. కార్డుల జారీలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన 1800425110 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం ప్రతి 2 కి.మీ. పరిధిలో పోలింగ్ కేంద్రాలలో బూత్‌లెవల్ అధికారులు, మండలస్థాయిలో తహసిల్దారు, డివిజినల్ స్థాయిలో రెవిన్యూ డివిజనల్ అధికారులు, జిల్లాస్థాయిలో కలెక్టరు నిర్వహించేలా చూడాలన్నారు.
విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు వారిలో స్పూర్తిని కలిగించే విధంగా ప్రతి కళాశాలలోనూ విద్యార్థులకు ఓటరుగా నమోదు, ఓటు హక్కు విలువ, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి అంశాలతో కూడిన పలు పోటీలు నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించి ప్రతిభావంతులకు ఈనెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేస్తారు . అంతేకాకుండా, ఓటరుగా ఉన్నందుకు గర్వపడుతున్నా- ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నా అనే నినాదంతో బాడ్జీలను కూడా అందజేస్తారు.