Type Here to Get Search Results !

Our Photo Gallery

ఉద్యోగులు, జర్నలిస్టులకు ఉచిత వైద్యం

ఉద్యోగులు, జర్నలిస్టులకు ఉచిత వైద్యం
   

🔹13 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌తో ప్రభుత్వం ఒప్పందం

🔻ఉద్యోగులు, జర్నలిస్టులకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం 13 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొన్నది. ఇకపై హెల్త్‌కార్డు చూపించి ఉచిత వైద్యం పొందవచ్చు.

🔻 ఉద్యోగులు, జర్నలిస్టులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న కార్పొరేట్ దవాఖానల్లో నగదురహిత వైద్యంను అందుబాటులోకి తెచ్చింది. జర్నలిస్టులు, ఉద్యోగులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఔట్‌పేషెంట్ (ఓపీ) సేవలను కూడా ప్రారంభించింది. ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం వెల్‌నెస్ సెంటర్‌ను శనివారం ఖైరతాబాద్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి ప్రారంభించారు. ఓపీ సేవలను ఇక్కడ అందించడంతోపాటు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి.. బ్రాండెడ్ మందులు అందిస్తారు. వ్యాధి ముదిరి ఉంటే.. అత్యవసర చికిత్సల కోసం కార్పొరేట్ దవాఖానలకు పంపిస్తారు. ఇక ఎమర్జెన్సీ సేవలను ప్రధాన సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో జర్నలిస్టులు, ఉద్యోగులు హెల్త్‌కార్డు ఆధారంగా ఉచితంగా పొందే వీలు కలిగింది.

🔻నగరంలోని 13 ప్రముఖ సూపర్ స్పెషాలిటీ దవాఖానలతో ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకొన్నది. ఖైరతాబాద్‌లో వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి లకా్ష్మరెడ్డి ఈ వివరాలు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లు, పాత్రికేయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం ప్రారంభించిన ఓపీ సెంటర్‌లో పరీక్షించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం పేషెంట్లను కార్పొరేట్‌కు రెఫర్ చేస్తారని చెప్పారు.

🔻 గ్రేటర్ హైదరాబాద్‌లోని వనస్థలిపురం, చార్మినార్, ఈసీఐఎల్ పరిధిలో మరో మూడు వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటుకానున్నాయని వెల్లడించారు. తర్వాతి క్రమంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక్కొక్కటి చొప్పున ప్రారంభిస్తామని ప్రకటించారు. ఉద్యోగులు, జర్నలిస్టులు ఏదైనా అత్యవసర చికిత్సకోసం నేరుగా తమ హెల్త్‌కార్డు తీసుకొని కార్పొరేట్ దవాఖానకు వెళ్లవచ్చన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, చింతల రాంచంద్రా రెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి, జర్నలిస్టుల ఆరోగ్య పథకం సీఈవో పద్మ తదితరులు పాల్గొన్నారు.

🔻ఉచితంగా కార్పొరేట్ వైద్యం
కిమ్స్, స్టార్, ప్రైమ్, కాంటినెంటల్, సన్‌షైన్, యశోద (మలక్‌పేట్, సోమాజిగూడ, సికింద్రాబాద్), కేర్ (బంజారాహిల్స్, నాంపల్లి, ముషీరాబాద్), అపోలో (జూబ్లీహిల్స్, హైదర్‌గూడ, సికింద్రాబాద్). గుండె, కిడ్నీలు, లివర్, సర్జికల్, క్యాన్సర్ తదితర 1885 వ్యాధులకు చికిత్సలు.

🔻సేవలకోసం ప్రత్యేక యాప్. పరీక్షల రిపోర్టు వాట్సప్‌లో. ఈహెచ్‌ఎస్ అండ్ జేహెచ్‌ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సమగ్ర ఆరోగ్య నివేదిక చేతిలోనే.

🔻ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే నేరుగా కార్పొరేట్ దవాఖానకు తీసుకెళ్లవచ్చు.

🔻ఓపీలో ఇవీ సేవలు
డెంటల్, ఫిజియోథెరపీ, కంటి, గైనిక్, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, ఆర్థో తదితర వైద్య సేవలు, రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ తదితర పరీక్షలు అందుబాటులో ఉంటాయి. రెండు వందల రకాల బ్రాండెడ్ మందులు ఉచితంగా ఇస్తారు.

Android App is for EJHS

Click here to Download App

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.