జ్ఞానకుమారీ హెడా
(స్వాతంత్ర్య సమరయోధురాలు)
🔹జ్ఞాన కుమారీ హెడా హైదరాబాదుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సర్వోదయ ఉద్యమ నాయకురాలు, గాంధీ స్మృతి అధ్యక్షురాలు. ఈమె సామాజిక సేవారంగంలో కూడా ప్రసిద్ధమైన పాత్ర పోషించింది.
🔹జ్ఞానకుమారి 1918, అక్టోబర్ 11న ఉత్తర ప్రదేశ్రాష్ట్రంలోని బులంద్‍షహర్ జిల్లాలోని ఖుర్గా గ్రామంలో జన్మించింది. బి.ఏ వరకు చదివింది. చిన్న వయసు నుండే జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని అనేక పర్యాయాలు జైలుకు కూడా వెళ్ళిన ఈమె 1936లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయో ధుడు హరీష్ చంద్ర హెడాను వివాహమాడి హైదరాబాదులో స్థిరపడింది. హైదరాబాదు రాష్ట్రంలో స్వాతంత్ర్యోద్యమం లో పాల్గొన్న అతికొద్ది మంది మహిళలలో ఈమె ఒకరు. క్విట్ ఇండియా ఉద్యమకాలం లో విమలాబాయి మేల్కోటే, పద్మజా నాయుడు, వనమాలి, కమలమ్మ తదితర మహిళలతో పాటు ఈమెను అరెస్టు చేసి, అప్పటికి మహిళా రాజకీయ ఖైదీలను ఉంచడానికి ప్రత్యేక జైళ్లు లేకపోవటంవలన మౌలాలీ సమీపంలోని కృష్ణప్రసాద్ దేవిడీలో నిర్భంధించారు.
🔹స్వతంత్రానంతరం క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకుని సాంఘిక సంస్థల్లో విశేష కృషిచేసింది. హైదరాబాదులో సాంఘిక, రాజకీయ చైతన్యం పెరగడానికి పనిచేసిన తొలితరం మహిళ జ్ఞానకుమారి హెడా.
🔹జ్ఞానకుమారి 1945 నుండి 1963 వరకు కస్తూర్బా గాంధీ జాతీయ స్మారక ట్రస్టు యొక్క హైదరాబాదు రాష్ట్ర ప్రాంతీయ ప్రతినిధిగా పనిచేసి హైదరాబాదులో కస్తూర్బా ట్రస్టును తీర్చి దిద్దింది.
🔹1946 నుండి 1957 వరకు హైదరాబాదు రాష్ట్ర హరిజన సేవక్ సంఘ్ యొక్క కార్యనిర్వాహక సంఘ సభ్యురాలిగా హరిజన హాస్టలును నిర్వహించింది.
🔹హైదరాబాద్ విమోచనోద్య మంలో సాహస చర్యలను ప్రదర్శించిన వనితలలో జ్ఞానకుమారిని చెప్పుకోవచ్చును. మేకులున్న బూట్లతో నడిచివెళ్ళిన బ్రిటీష్ కలెక్టర్‌ను చెప్పుతో కొట్టిన వీరవనిత.
🔹గాంధీజీ నిధి వసూలుకు వచ్చి నపుడు చెవుల ఆభరణాలు తీసిచ్చారు. హైద రాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీలో మహిళా సభ్యురాలుగా ఉన్నారు.
🔹రజాకార్ల అకృత్యా లకు ఎదురు నిలిచినం దుకు రెండు మార్లు హత్యా ప్రయత్నం జరిగింది.
🔹ఆ రోజులో జ్ఞానకుమారి, పద్మజానాయుడు కలిసి రహస్యంగా గాంధీజీ పుట్టిన రోజు జరుపడానికి ప్రయత్నించినపుడు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
🔹హైదరాబాద్ లోని బడీ చౌడీలో నివసించే మరాఠీలకు దేశభక్తి ఎక్కువ. ఒకసారి బుద్ధితక్కువై ఆ ప్రాంతంలోని ఇళ్లపై రజాకారులు దాడి చేసారు. అప్పుడు మరాఠీ స్త్రీలు చెప్పులు, చాటలు, చీపుర్లు చేతబట్టి వారిని తరిమితరిమి కొడ్తే రజాకార్లు వెనక్కి తిరిగి చూడకుండా ఒకటే పరుగు. అక్కడ నివసించే డాక్టర్ హరిశ్చంద్ర హెడా, జ్ఞానకుమారి హెడాలు ప్రజలను చైతన్య పరిచారు.ఇమ్రోజ్ పత్రికాసంపాదకుడు షోయబుల్లా ఖాన్‌ను రజాకార్లు నడిరోడ్డుపై తల్వార్లతో నరికి హత్య చేసాక నిండుగర్భిణి ఐన ఆయన భార్యను రహస్యంగా తప్పించి తమ ఆసుపత్రిలో పురుడు పోసిన ఘనత హెడా దంపతులదే. వారిద్దరూ అనేక త్యాగాలు చేసినా స్వాతంత్య్రం వచ్చాక ఎటువంటి పదవులను స్వీకరించలేదు. వారి దవాఖానా ఇప్పటికీ కాచిగూడ టూరిస్ట్ హోటల్ ఎదురుగా ఉంది.
🔹మహాత్మాగాంధీ మరణించిన తర్వాత ఆయన అస్థికలను జ్ఞానకుమారి1948 ఫిబ్రవరి 12న హైదరాబాదులోని లంగర్ హౌజ్ ప్రాంతంలోని మూసీ నది, ఈసీ నది సంగమ ప్రదేశంలో నిమజ్జనం చేసింది. అప్పటి నుండి ఈ ప్రాంతం బాపూఘాట్‍గా పేరు పొందింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సర్వోదయ సంస్థ సభ్యులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 12న గాంధీ స్మృతి ప్రార్ధనా దినోత్సవంగా జరుపుకుంటారు.
🔹ఈమె 89 ఏళ్ల వయసులో న్యూజెర్సీలోని తన కుమారుని నివాసంలో జూలై 18, 2008న మరణించింది.